1-3. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
4.మనుష్యుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చినవారై,
5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్ళవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
6. ఏలయనగా -ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడియున్నది.
7. విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే -ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయెను.మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.
8. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.
9. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు.
10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి.
11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,
12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్ క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.
13. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లొబడియుండుడి.
14. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి.
15. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తనగలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.
16. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి.
17. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.
18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి.
19. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షి కలిగి, దు:ఖము సహించిన యెడల అది హితమగును.
20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి.
21. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.
22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.
23. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.
25. మీరు గొర్రెలవలె దారి తప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళియున్నారు.
Download Audio File
No comments:
Post a Comment