Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, May 7, 2013

1 పేతురు 1వ అధ్యాయము

1-2. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును,యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును  ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ,కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
4. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను.
5. కడవరి  కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి  నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెముకాలము మీకు దు:ఖము కలుగుచున్నది.
7. నశించిపొవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
8. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు;
9. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
10-11. మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు  ఈ రక్షణను గూర్చి  పరిశీలించుచు, తమయందున్న
క్రీస్తు ఆత్మ  క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా  సాక్ష్యమిచ్చునప్పుడు,ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచూవచ్చెనో  దానిని విచారించి పరిశోధించిరి.
12. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన  మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు
తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు  కాదు గాని మీకొరకే తాము పరిచర్య  చేసిరను సంగతి  వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ  కార్యములను తొంగిచూడగోరుచున్నారు.
13. కాబట్టి  మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ది గలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నీరీక్షణ కలిగియుండుడి.
14-16. నేను పరిశుద్ధుడనై  యున్నాను గనుక మీరును పరిశుద్దులై యుండుడని వ్రాయబడియున్నది. కాగ మీరు విధేయులగు పిల్లలై,మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,మిమ్మును పిలచినవాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
17. పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రియని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంత కాలము భయముతో గడుపుడి. 
18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని
19. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా
20-21. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి. 
22-23. మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. 
24. ఏలయనగా -సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. 
మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే.         
    Download Audio File           

Friday, May 3, 2013

1 పేతురు 2వ అధ్యాయము


1-3. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి. 
4.మనుష్యుల చేత విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నొద్దకు వచ్చినవారై,
5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్ళవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 
6. ఏలయనగా  -ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమునందు వ్రాయబడియున్నది. 
7. విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే -ఇల్లు కట్టువారు ఏ  రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయెను.మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.  
8. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. 
9. అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. 
10. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజయైతిరి; ఒకప్పుడు కనికరింపబడక యిప్పుడు కనికరింపబడినవారైతిరి. 
11. ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి,
12. అన్యజనులు మిమ్మును ఏ  విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్ క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 
13. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లొబడియుండుడి. 
14. రాజు అందరికిని అధిపతియనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజువలన పంపబడినవారనియు వారికి లోబడియుండుడి. 
15. ఏలయనగా మీరిట్లు యుక్తప్రవర్తనగలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. 
16. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడి యుండుడి. 
17. అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. 
18. పనివారలారా, మంచివారును సాత్వికులునైనవారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణభయముతో లోబడియుండుడి. 
19. ఎవడైనను  అన్యాయముగా శ్రమ పొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షి కలిగి, దు:ఖము సహించిన యెడల అది హితమగును. 
20. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. 
21. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. 
22. ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ  కపటమును కనబడలేదు. 
23. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. 
24. మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే  తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి. 
25. మీరు గొర్రెలవలె దారి తప్పిపోతిరి గాని యిప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళియున్నారు.
          Download Audio File

1 పేతురు 3వ అధ్యాయము


1. అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
2. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
3. జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
4. సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృశ్టికి మిగుల విలువగలది. 
5. అటువలె పూర్వమందు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.
6. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ  భయమునకు బెదరకయున్న యెడల ఆమెకు పిల్లలగుదురు.
7. అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.
8. తుదకు మీరందరూ ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.
9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక దీవించుడి.
10. -జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చేడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
11. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను.
12. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది.
13. మీరు మంచి విషయములలో ఆసక్తిగలవారైతే మీకు హాని చెయువాడెవడు?
14. మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
15-16. నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి; అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడురు.
17. దేవునిచిత్తమాలాగున్న యెడల కీడు చేసి శ్రమపడుట కంటె మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. 
18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. 
19-20. దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిదేయులైనవారియొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణ పొందిరి. 
21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. 
22. ఆయన పరలోకమునకు వెళ్లి దూతలమీదను అధికారులమీదను శక్తులమీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు.  
      Download Audio File 

1 పేతురు 4వ అధ్యాయము


1. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి.
2. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి ఇక నేమియులేక యుండును.
3. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు,అన్యజనుల ఇష్టము నేరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును.
4. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతోకూడ మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు.
5. సజీవులకును మృతులకును తీర్పుతీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులైయున్నారు.
6. మృతులు శరీర విషయములో మానవరీత్య తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవునిబట్టి జీవించునట్లును వారికికూడ సువార్త   ప్రకటింపబడెను.
7. అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.
8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమగాలవారై యుండుడి.
9. సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిధ్యము చేయుడి.
10. దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహనిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.
11. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బొధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక, ఆమేన్.
12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి.
14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ,మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు.
16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గు పడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. 
17. తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? 
18. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియి ఎక్కడ నిలుతురు?
19. కాబట్ట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ ప్రవర్తన గలవారై,నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.
          Download Audio File 

1 పేతురు 5వ అధ్యాయము


1. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
2. బలిమి చేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుడి.
3. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;
4. ప్రధానకాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దెవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమస్కులై యుండుడి.
7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
9. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి; విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును.
11. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక.ఆమేన్ . 
12. మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి. 
13. బబులోనులో  మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. 
14. క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్.
           Download Audio File